హీరోయిన్ భావన పెళ్లి తేదీ ఖరారైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ నటి.. చిరకాల మిత్రుడు, శాండిల్ వుడ్ ప్రొడ్యూసర్ నవీన్ ను పెళ్లిచేసుకోబోతోంది. జనవరి 22న వీళ్ల వివాహం బెంగళూరులో జరుగుతుంది. త్రిసూర్ లోని ‘లలు కన్వెన్షన్ సెంటర్’ వేదికగా వీరు ఒక్కటికానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నిహిత మితృలకు, బంధువులకు ఆహ్వానాలు అందాయి.
ఈ ఏడాది మార్చి 9న కేరళలో వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీప్రముఖులు ఎవర్నీ ఆహ్వానించలేదు. పెళ్లిని కూడా సినీ పరిశ్రమకు దూరంగా జరుపుకోవాలని భావన భావిస్తోంది. కేవలం కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది.
భావనపై లైంగిక వేధింపుల కేసు కేరళ చిత్రపరిశ్రమను ఓ ఊపుఊపింది. మల్లూవుడ్ స్టార్ దిలీప్ అరెస్టయి, 85రోజులు జైలుజీవితం గడిపింది కూడా ఈ కేసుపైనే. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. ఆ ఘటన జరిగిన వెంటనే నిశ్చితార్థం చేసుకుంది భావన. తర్వాత బయట పెద్దగా కనిపించలేదు. సినిమాలు కూడా తగ్గించేసింది.
2002లో భావన ఓ మలయాళ చిత్రంలో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ్, కన్నడ సిమాల్లో నటించారు.