రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సహకరించిన స్వపక్ష, విపక్ష, మిత్రపక్ష సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయంగా భావించే అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం సంతోషం అన్నారు. అపార రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికవ్వడం గర్విస్తున్నాం అన్నారు.
రాష్ట్ర సర్వతోముఖా అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే చర్చలు అర్ధవంతంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జరగడానికి మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశీస్తున్నాం అన్నారు. ప్రజల ఇబ్బందులు, సమస్యల పై లోతుగా చర్చించడానికి సభలో గౌరవ సభ్యులకు అత్యంత సమయం ఇస్తారని భావిస్తున్నాను అన్నారు. సభ్యులు కూడా వారి గౌరవాన్ని కాపాడుకుంటూ సభ మర్యాదలను పాటిస్తూ వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రజా సమస్యలపై సభలో లోతుగా చర్చించడానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించిన మీ పరిపాలన అనుభవం దోహదపడుతుందన్నారు. షెడ్యూల్ కాస్ట్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన మీరు ఆ శాఖ పట్ల చొరవ చూపించి సమాజంలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ అభ్యున్నతి కోసం పాటుపడడం సమాజానికి ఉపయోగపడిందన్నారు. హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసిన సమయంలో చేనేత రుణాలు మాఫీ చేయించి చేనేత రంగంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించిన తీరు మీ మంచితనానికి, ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు.
Also Read:సోషల్ మీడియా పోస్టులపై మంత్రి ఆగ్రహం