ఓ వైపు సర్వేలన్ని జగన్ గెలుపు ఖాయమని జోస్యం చెబుతున్నాయి. అత్యధిక ఎమ్మెల్యే,ఎంపీ స్ధానాలను గెలుచుకుని జగన్ అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడిస్తుండటంతో ఏపీలో బెట్టింగ్ జోరందుకుంది. అయితే విచిత్రం ఏంటంటే బెట్టింగ్ నిర్వాహకులు చంద్రబాబును ఫెవరేట్‌గా జగన్‌ను అన్ ఫెవరేట్ చేస్తూ టెంప్ట్ చేస్తున్నారు.
టీడీపీ గెలిస్తే లక్షకు లక్షన్నర అదే జగన్ సీఎం అయితే లక్షకు రెండున్నర లక్షలు ఇస్తామంటూ జోరుగా బెట్టింగ్ దందా సాగుతోంది. దీంతో టెంప్ట్ అవుతోన్న బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల్లో పందేలు కాస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఒక్క రోజే 50 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 200 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
అయితే అభ్యర్ధుల గెలుపోటముల కంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైనే ప్రధానంగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. క్రికెట్ బుకీలే ఈ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెంలో పలువురిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.