పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తల నరికి తెచ్చిన వారికి రూ. 11లక్షల రివార్డు ఇస్తారంటా. అవును.. మీరు విన్నది నిజమే. ఈ మాటన్నది ఎవరో కాదు..భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నేత యోగేశ్ వర్షనీ . ఇప్పుడు యోగేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. అసలు యోగేశ్ వర్షనీ మమతాబెనర్జీ పై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు కారణం ఏంటంటే…
మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా పశ్చిమ్‌బంగాలోని బీర్భమ్ జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఇక్కడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. పోలీసులు చెప్పినప్పటికి కూడా నిర్వాహకులు వినిపించుకోకుండా ర్యాలీని కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఘర్షణను అదుపుచేసేందుకు ర్యాలీలో పాల్గొన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
లాఠీచార్జ్ పై స్పంధించిన బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మమతాబెనర్జీ తలను తెగనరికి తీసుకువచ్చిన వారికి రూ. 11 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా మమత ముస్లింలకు మద్దతిస్తూ..ఇఫ్తార్ విందులు చేస్తారని, కానీ..శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు మమత అనుమతించట్లేదని యోగేశ్ వ్యాఖ్యలు చేశారు. ఇక యోగేశ్ వర్షనీ చేసిన వ్యాఖ్యలతో స్థానికంగా పెనుదుమారమే రేగింది.