ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ఆటగాళ్లు క్వారంటైన్ సెంటర్లకు చేరుకోగా ఏప్రిల్ 9 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈసారి ఆంక్షల మధ్యనే ఐపీఎల్ జరగనుంది.ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసింది బీసీసీఐ.
ఐపీఎల్ కోసం బీసీసీఐ రూపొందించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. గత సీజన్ నుంచి మ్యాచ్‌లను రాత్రి 7.30 గంటలకు ప్రారంభిస్తుండగా డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటే తొలి మ్యాచ్ సాయంత్రం 3.30 గంటలకు మొదలు పెడుతున్నారు. ఈసారి కూడి ఇవే టైమింగ్స్.
గతంలో ఒక ఇన్నింగ్స్ ముగియడానికి 90 నిమిషాలపైనే సమయం పట్టేది. ఒక్కోసారి 90వ నిమిషంలో 20వ ఓవర్ వేయడం మొదలు పెట్టే వాళ్లు. కానీ కొత్త నిబంధన ప్రకారం 90 నిమిషాల్లోపు మొత్తం ఇన్నింగ్స్ ముగించాలి. ఇందులో 85 నిమిషాలు ప్లేయింగ్ టైమ్ కాగా, మిగిలిన 5 నిమిషాలు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ కోసం కేటాయించారు.
ఇకపై సాఫ్ట్ సిగ్నల్ నామమాత్రం కానుంది. కేవలం రికార్డు బుక్స్‌లో పరిగణలోకి తీసుకోవడానికి అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇస్తాడు తప్ప టీవీ అంపైర్ దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీవీ అంపైర్ సహాయం తీసుకోవాలని ఫీల్డ్ అంపైర్లు భావిస్తే.. ముందుగా బౌలర్ వైపు ఉన్న అంపైర్ మాత్రమే టీవీ అంపైర్‌తో మాట్లాడాల్సి ఉంటుంది. మొత్తంగా 14వ సీజన్ ప్రాంఛైజీల సరికొత్త జెర్సీల,ఆటగాళ్ల మార్పులతో ఆధ్యంతం ఆసక్తికరంగా ఉండనుంది.

