భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలకమండలిని నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. నలుగురు సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. కమిటీ చీఫ్‌గా మాజీ కాగ్ వినోద్ రాయ్‌ని నియమించింది. ఆయనతో పాటు రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయె,మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ డయానా ఎడుల్జీలను కమిటీ సభ్యులుగా ప్రకటించింది.
లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడంతోపాటు బోర్డు రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. గత విచారణ సందర్భంగానే కోర్టు నియమించిన అమికస్ క్యూరీ 9 మంది పేర్లను సీల్డ్ కవర్‌లో అందజేసింది. అప్పుడే సభ్యులను ప్రతిపాదించే అవకాశాన్ని కేంద్రంతోపాటు బీసీసీఐకి కూడా కోర్టు కల్పించింది. దీనిని ఒక గౌరవంగా భావిస్తున్నానని, ఇది తనపై పెద్ద బాధ్యతను మోపిందని డయానా ఎడుల్జీ వ్యాఖ్యానించింది.
ఈ కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు చోటు దక్కలేదు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలంటూ కేంద్ర సర్కారు చేసిన విన్నపాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. బీసీసీఐలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన లోధా కమిటీ పలు సిఫారసులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోర్డు వ్యవహారాలను చూసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది.