గత రెండు రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ బృందం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసింది. గురువారం బెంగళూర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్థానిక లీలా ప్యాలెస్‌లో తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారధ్యంలో సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ నూలి, కె.కిషోర్‌గౌడ్‌లు ప్రత్యేకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, తదితరులను కలుసుకోనున్నట్లు చైర్మన్ వివరించారు. బిసి కమిషన్ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు, ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.