తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబరాలు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులు ప్రకృతితో మమేకమై పోయే బతుకమ్మ ఉత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది సైతం అదే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 28 వరకు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు.
బతుకమ్మ పండుగ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీఎస్ …. తెలంగాణ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న 35వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 28న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పేద, మధ్య తరగతి ఆడబిడ్డలకు చీరలు కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటీ నాలుగు లక్షల చీరలు (200ల కోట్ల విలువైన ఆరు కోట్ల 11లక్షల మీటర్లు) పంపిణీ చేయాలని నిర్ణయించారు. 18 నుంచి 40 ఏళ్లలోపు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.