Bathukamma:ఎంగిలిపూల బతుకమ్మ

59
- Advertisement -

బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ ఇది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ.

రోజుకో రీతిలో పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండుగకు తెలంగాణ యావత్తూ పూల వనంలా మారిపోతుంది. తొలి రోజు బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అంటారు. పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి, తమలపాకులు ఉంచి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు సాగే ఈ వేడుకల్లో ప్రతీ రోజు బతుకమ్మను ఒక్కోపేరుతో పిలస్తూ, ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

1వ రోజు – ఎంగిలి పూవు బతుకమ్మ – నువ్వులు, బియ్యపు పిండి.
2వ రోజు – అటుకుల బతుకమ్మ – చప్పిడి పప్పు, బెల్లం , అటుకులు.
3వ రోజు – ముద్ద పప్పు బతుకమ్మ – ముద్ద పప్పు, పాలు, బెల్లం.
4వ రోజు – నానబియ్యం బతుకమ్మ – నానబెట్టిన బియ్యం, పాలు,బెల్లం.
5వ రోజు – అట్ల బతుకమ్మ – అట్లు
6వ రోజు – అలిగిన బతుకమ్మ – నైవేద్యం ఉండదు.
7వ రోజు – వేపకాయల బతుకమ్మ – బియ్యపు పిండిని వేపకాయలలాగా చేసి నూనెలో వేయించి సమర్పిస్తారు.
8వ రోజు – వెన్నముద్దల బతుకమ్మ – నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం.
9వ రోజు – సద్దుల బతుకమ్మ – పెరుగన్నం, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, కొబ్బరన్నం మరియు నువ్వుల అన్నం.

ఈ పండుగలో పరమార్థం ఏమిటంటే బతుకమ్మను తయారు చేయడంలో మనం రకరకాల పూలను వాడతాం, ఎన్ని పూలు వాడిన కానీ అవన్ని పైకి పోతూ చివరకు గౌరమ్మ దగ్గరే కలిసిపోతాయి. అలాగే మనం కూడా మెల్లమల్లగా ఈ ప్రాపంచిక విషయాలను అంటకుండా ఆ ఆదిశక్తినే చేరుకోవాలి.

ప్రతి పాటలోని చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు వాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శశి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైన పాటలు కూడా పాడతారు. అన్నిటికన్నా సద్దుల బతుకమ్మను చాలా వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మకు ముందు చిన్నపిల్లల చేత బొడ్డెమ్మ ఆడించడం ఆనవాయితి.

Also Read:గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

- Advertisement -