కెనడా ప్రముఖ నగరం టొరంటోలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కెనడా నేతృత్వంలో పనిచేసే తంగేడు సాంస్కృతిక సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది. పుట్టి పెరిగిన తెలంగాణ నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా, తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని, కెనడాలో పుట్టిన పిల్లలకు పండగల ప్రాధాన్యతలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ యేటా బతుకమ్మతో సహా బోనాలు, ఇతర పండగలను నిర్వహిస్తున్నామని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ తెలిపింది.
ప్రకృతి, పర్యావరణంతో అలరారే కెనడాలో లభించే రంగురంగుల పూలతో పేర్చన బతుకమ్మలు పండగ సంబరాలకు మరింత వన్నె తెచ్చాయి. టొరంటోలో బ్రాంప్టన్ వేదికగా విశాలమైన సెకండరీ స్కూల్ ఈ వేడుకలకు వేదిక అయింది. సుష్మ సాయి, అమితా రెడ్డిలు సమన్యయం చేసి పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబాలతో సహా పాల్గొనేలా చేశారు.
పండగలో పాల్గొన్న అందరికీ కమిటీ పసందైన తెలంగాణ వంటలతో విందును ఏర్పాటు చేసింది. కెనడాలో స్థిరపడినా తమ మూలాలు, అస్థిత్వం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఉత్సవాలను, బతుకమ్మ పండగను ప్రతీ యేటా నిర్వహిస్తున్నామని టీడీఎఫ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది అన్నారు. పండగ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ టీడీఎఫ్ (కెనడా) ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్ నేరవేట్ల, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ ధర్మపురి, వెంకట రమణా రెడ్డి మేద, తదితరులు పాల్గొన్నారు.
Also Read:ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘మునగ లడ్డూ’!