సీఎంలైన తండ్రి-కొడుకుల జాబితాలోకి బొమ్మై..

70
new cm

కర్ణాటక 23వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు బసవరాజు బొమ్మై. బెంగుళూరులోని రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రమాణ‌స్వీకార కార్య‌క్ర‌మం కరోనా నిబంధనల మధ్య జరిగింది. మాజీ సీఎం యెడ్డీలాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ వర్గానికి చెందినవారు. శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్ బొమ్మైతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడే బసవరాజు బొమ్మై. తండ్రిలాగే సీఎం పీఠాన్ని అధిష్టించిన తనయులు జాబితాలో చేరారు బసవరాజు. బసవరాజ్‌ బొమ్మై తండ్రి సోమప్ప రామప్ప బొమ్మై (ఎస్‌ఆర్‌ బొమ్మై) 1988-1989లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. హెచ్‌డీ దేవెగౌడ, తర్వాత ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎం పదవిని చేపట్టారు.

ఎం.కరుణానిధి-ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు), వైఎస్‌ రాజశేఖరరెడ్డి-వైఎస్‌ జగన్‌ (ఏపీ), బిజూ పట్నాయక్‌-నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా), దోర్జీ ఖండూ-పెమా ఖాండూ (అరుణాచల్‌ ప్రదేశ్‌), శిబూ సోరేన్‌-హేమంత్‌ సోరేన్‌ (జార్ఖండ్‌), ములాయం సింగ్‌ యాదవ్‌-అఖిలేశ్‌ యాదవ్‌ (యూపీ), హేమావతి నందన్‌ బహుగుణ (యూపీ)-విజయ్‌ బహుగుణ (ఉత్తరాఖండ్‌), దేవీలాల్‌-ఓం ప్రకాశ్‌ చౌతాలా (హర్యానా), శంకర్‌రావు చౌహాన్‌-అశోక్‌ చౌహాన్‌ (మహారాష్ట్ర). జమ్ముకశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబంలో మూడు తరాల నేతలు తాత-తండ్రి-కొడుకు సీఎంలు అయ్యారు. ఇక కశ్మీర్‌లోనే తండ్రి-కుమార్తె (ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌-మెహబూబా ముఫ్తీ) సీఎంలు అయ్యారు.

Basavaraj Bommai Is The New Chief Minister Of Karnataka | BJP | Great Telangana TV