ప్రస్తుతం బరాక్ ఒమామా అమెరికా అధ్యక్షపదవిలో లేకపోయినా.. ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. సోషల్‌మీడియా ద్వారా నెటిజన్లకు టచ్ లో ఉన్న ఒబామా ఇప్పుడు మరో సరికొత్త రికార్డును సృష్టించారు. పాపులర్ ట్వీట్లు చేసిన జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్ ఒబామా చేసిందేనట. ఈ విషయాన్ని ట్విటర్ వెల్లడించింది.
ఈ ఏడాది ఆగష్టులో వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లేలో పెద్దఎత్తున జాతివిద్వేష ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఒబామా తన వ్యక్తిగత ట్విటర్ ద్వారా నెల్సన్ మండేలా సూక్తుల్లో ఒకటైన ‘శరీర ఛాయ, మతం, నేపథ్యం కారణంగా ఎవరూ మరొకరిని ద్వేషించరు’ అని ఒబామా ట్వీట్ చేశారు. దాంతో పాటు కిటికీ వద్ద ఉన్న చిన్నారులను సంతోషంగా పలకరిస్తున్న ఫొటోను ఆయన పోస్టు చేశారు.
అయితే ఈ ట్వీట్ ఈ ఏడాది ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌గా తొలిస్థానంలో నిలిచింది. ఈ ట్వీట్‌కు 4.6మిలియన్ల లైక్‌లు వచ్చాయి. అంతేగాక.. ఎక్కువ మంది రీట్వీట్ చేసిన ట్వీట్ల జాబితాలోనూ ఇది రెండోస్థానంలో ఉంది.
ఇక..ట్విటర్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్నవారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కానీ ట్వీట్ల విషయంలో మాత్రం ట్రంప్ వెనుకబడ్డారు.