బంగ్లాదేశ్ అల్లర్లు..అవామీ లీగ్ ఆఫీస్‌లకు నిప్పు

5
- Advertisement -

బంగ్లాదేశ్‌లో యువ నాయకుడు ఒస్మాన్ హాది మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర అల్లర్లు చెలరేగాయి. గత వారం ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న సమయంలో హాదిపై కాల్పులు జరిగాయి. చికిత్స నిమిత్తం సింగపూర్‌లోని ఆసుపత్రిలో ఉన్న హాది అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.

రాజ్‌షాహీలోని అవామీ లీగ్ స్థానిక కార్యాలయాన్ని నిరసనకారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. అలాగే దేశంలోని ప్రముఖ దినపత్రికలు ది డైలీ స్టార్, ప్రథమ్ ఆలో కార్యాలయాలకు కూడా నిప్పు పెట్టారు. ఢాకాలోని డైలీ స్టార్ కార్యాలయంపై గుంపు దాడి చేయడంతో, అక్కడ చిక్కుకున్న 25 మంది జర్నలిస్టులను నాలుగు గంటల తర్వాత రక్షించారు.

గురువారం సాయంత్రం ఢాకాలో డైలీ స్టార్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆగ్రహ గుంపు, లోపలి భాగాలను పూర్తిగా నాశనం చేసింది. కాలిపోయిన కార్యాలయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు సమాచారం.

ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హాది మృతికి సంతాప సూచకంగా శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. అలాగే దేశంలోని పరిస్థితిపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read:BB9:తనూజ జర్నీ..ఎమోషనల్

- Advertisement -