ICC:బంగ్లాదేశ్‌పై కఠిన చర్యలు తప్పవా!

9
- Advertisement -

టీ20 వరల్డ్‌కప్‌ 2026 వివాదంలో బంగ్లాదేశ్ తమ వైఖరిని మార్చుకోవడం లేదు. భద్రతా కారణాలు చూపిస్తూ భారత్‌లో జరిగే మెగా టోర్నీకి రావడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని వారు డిమాండ్ చేయగా, ఐసీసీ దీనిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలో చేర్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్‌కప్‌ 2026 కోసం భారత్‌కు ప్రయాణించడానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌పై కఠిన చర్యలు తీసుకునే అంశంపై ఐసీసీ చైర్మన్ జే షా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ సమావేశంలో కూడా బంగ్లాదేశ్‌ను భర్తీ చేయాలనే ప్రతిపాదనకు బోర్డు సభ్యులు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ, మరోసారి తమ ప్రభుత్వంతో సంప్రదించుకునేందుకు బీసీబీకి ఐసీసీ ఒక రోజు సమయం ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసే అవకాశాలు మరింత బలపడ్డాయి.

అయితే, మెంబర్స్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌ (MPA)పై సంతకం చేసిన తర్వాత ప్రపంచస్థాయి టోర్నీ నుంచి తప్పుకోవడాన్ని ఐసీసీ తేలికగా తీసుకోదు. ఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు జే షా ఇప్పటికే దుబాయ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌కు లభించే సుమారు 3 లక్షల డాలర్ల పాల్గొనుబడి ఫీజును వారు ఖచ్చితంగా కోల్పోతారు. అంతేకాదు, ఐసీసీ ఎంఫీఏ నిబంధనల ప్రకారం, ముందుగా అంగీకరించి తర్వాత ప్రపంచ టోర్నీ నుంచి వైదొలిగితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే, 2024-27 ఆదాయ పంపిణీ మోడల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌కు దక్కే ఆదాయ వాటాకు భారీ దెబ్బ తగులుతుంది.

అదేవిధంగా, వరల్డ్‌కప్‌లో పాల్గొనే 20 జట్ల మధ్య ర్యాంకింగ్ పాయింట్ల పంపిణీలో బంగ్లాదేశ్‌కు నష్టం వాటిల్లుతుంది. తమ కంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్న జట్లు టోర్నీలో ఆడటం వల్ల బంగ్లాదేశ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనక్కి జారే ప్రమాదం ఉంది. ఫలితంగా వచ్చే వరల్డ్‌కప్‌కు ఆటోమేటిక్ అర్హత కోల్పోయి, తక్కువ ర్యాంక్‌ జట్లతో క్వాలిఫయర్లు ఆడాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ దయనీయ స్థితిలో ఉందని చెప్పాల్సిందే. ఆటగాళ్లు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు మరియు ప్రభుత్వం వారి మార్గాన్ని అడ్డుకుంటున్నాయి.

Also Read:న్యాయస్థానంతో ఆటలా:హైకోర్టు

- Advertisement -