ఐసీసీపై బంగ్లా సంచలన ఆరోపణలు

7
- Advertisement -

అండర్-19 వరల్డ్ కప్ 2026 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత, పోటీలో ఇతర జట్లతో పోలిస్తే తాము ఎక్కువగా ప్రయాణించాల్సి వచ్చిందని పేర్కొంటూ ఐసీసీ షెడ్యూలింగ్ అన్యాయంగా ఉందని బంగ్లాదేశ్ ఆరోపించింది.

అంతర్జాతీయ క్రికెట్ మండలితో (ఐసీసీ) బంగ్లాదేశ్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌లో మ్యాచ్‌లు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఐసీసీ అభ్యర్థనను తిరస్కరించడంతో, గతంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ నుంచి బయటపడిన బంగ్లాదేశ్, మరోసారి ఐసీసీపై అన్యాయ షెడ్యూలింగ్ ఆరోపణలు చేసింది.

బంగ్లాదేశ్ గేమ్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ హబీబుల్ బషార్ మాట్లాడుతూ, జట్టు ఎదుర్కొన్న కఠినమైన ప్రయాణ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు టోర్నీ మొత్తం నిరాశకు గురయ్యారని తెలిపారు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్వయంగా ఖర్చు భరించి దేశీయ విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

ఈ ఏడాది వరల్డ్ కప్ సందర్భంగా దేశీయ విమాన ప్రయాణాలను ఐసీసీ నిషేధించడంతో, జట్లు, అధికారులు, సిబ్బంది బస్సుల్లోనే ప్రయాణించాల్సి వచ్చింది. “భారత్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు బీసీబీ స్వంత ఖర్చుతో విమాన ప్రయాణం ఏర్పాటు చేసింది. బస్సు ప్రయాణం చాలా దీర్ఘంగా ఉండగా, నేరుగా విమానాలు కూడా అందుబాటులో లేవు.

Also Read:మరోసారి బంగారం భగభగ

మాకు కేటాయించిన షెడ్యూల్ చాలా అన్యాయంగా ఉంది. ప్రారంభ షెడ్యూల్ ప్రకారం మస్వింగోలో రెండు వార్మ్-అప్ మ్యాచ్‌లు ఆడి, నాలుగు గంటల దూరంలో ఉన్న బులవాయోకు ప్రయాణించి గ్రూప్ దశ తొలి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండేది. తర్వాత ఐసీసీ అకస్మాత్తుగా షెడ్యూల్ మార్చింది. దాంతో మేము వేర్వేరు వేదికల్లో వార్మ్-అప్ మ్యాచ్‌లు ఆడుతూ ఎడతెగని ప్రయాణాలు చేయాల్సి వచ్చింది.

టోర్నీ ప్రారంభానికి ముందే ఈ ప్రయాణ భారాన్ని మేము వారికి తెలియజేశాం. తరచూ ప్రయాణాలు లేకుండా ప్రాక్టీస్ మ్యాచ్‌ల వేదికలు మార్చాలని కోరాం. కానీ వారు పట్టించుకోలేదు అన్నారు.

- Advertisement -