బతుకమ్మ ప్రపంచానికే ఆదర్శం

459
- Advertisement -

తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ పూలవనం అయ్యింది. మారుమూల పల్లె నుంచి రాజధాని హైదరాబాద్ వరకు బతుకమ్మ పాటలతో మారుమోగింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడవాళ్లంతా సంప్రదాయబద్దంగా అలంకరించుకొని ఎంగిలిపూల పండుగను ఘనంగా జరుపుకున్నారు.

kavitha

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము అయ్యే చందమామ వంటి పాటలతో తెలంగాణ మార్మోగింది. ఆడబిడ్డలు సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మలకు నైవేద్యం సమర్పించారు. సంప్రదాయ అలంకరణలతో బతుకమ్మ ఆటపాటలతో మురిసిపోయారు.

kavitha bathukamma

ప్రకృతిని పూజిస్తూ, మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటుతున్న బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. యూఏఈలోని ఉమ్‌అల్‌ క్వయిన్‌లో శుక్రవారం జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు. గల్ఫ్‌ వచ్చినా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమని కవిత వారిని అభినందించారు. బతుకమ్మ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేందుకే తొమ్మిది దేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.

batukamma

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను ప్రారంభించిన కేంద్రమంత్రి దత్తాత్రేయ బతుకమ్మను ఢిల్లీలో నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ బతుకమ్మను ఎత్తుకొని తెలంగాణ ఆడపచులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తానూ మద్దతిచ్చానని, అమరవీరులు ఇంకా తన కళ్ల ముందు మెదులుతున్నారని ఆమె పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ శుక్రవారం తమ నివాసంలో మహిళా సిబ్బందితో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆమె స్వయంగా పాటలు పాడి అలరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కార్యాలయ అధికారులు ఈ వేడుకలను తిలకించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, మంత్రి మహేందర్‌రెడ్డి సతీమణి, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీత, పోచారం శ్రీనివాస్‌రెడ్డి సతీమణి పుష్ప, కోడలు సోని, ఈటల రాజేందర్‌ సతీమణి జమున, కుమార్తె నీత, కరీంనగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎంపీ వినోద్‌కుమార్‌ సతీమణి మాధవి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ కుమార్తె నందిని ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Kavitha UAE

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉత్సవాలు ఆరంభమయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా ఉదయం నుంచే గౌరీ పూజలు చేసి బతుకమ్మలను పేర్చిన మహిళలు సాయంత్రం ప్రదర్శనగా వేదికల వద్దకు చేరుకున్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడి చెరువుల్లో నిమజ్జనం చేశారు.

హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్ట్స్ ఉయ్యాల పాటలతో హోరెత్తింది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఇంట్లో పూల సంబురం ఘనంగా ప్రారంభమైంది. మొదట డిప్యూటీ స్పీకర్ బతుకమ్మ పేర్పులో పాల్గొన్నారు. రకరకాల పూలతో బకుకమ్మను అందంగా అలంకరించారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, పోచారం సతీమణులు కూడా వేడుకలో పాల్గొని.. ఉయ్యాల పాటలతో బతుకమ్మ ఆడారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు.

smriti irani

ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలతో భాగ్యనగరం మురిసిపోయింది. నగర వ్యాప్తంగా బంగారు బతుకమ్మ సంబురాల్లో ఆడపడుచులు ఆడిపాడారు. ఎల్బీనగర్లోని జెడ్పీ హైస్కూల్లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్లోనే మన్నెగూడలో కూడా తొలి రోజు బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి.

- Advertisement -