కోదండరాంపై సుమన్ ఫైర్‌..

100
Balka Suman Fires On Kodandaram

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌పై టీఆర్ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన సుమన్‌….కోదండరామ్‌ కాంగ్రెస్‌ కార్యకర్తగా మారి ఆ పార్టీకి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై కోదండరాం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. మిషన్ భగీరథపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తూ బురద జల్లే కార్యక్రమాలను సహించబోమని హెచ్చరించారు. కోదండరాం దుష్ఫ్రచారాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. ఎవరికీ కూడా అన్యాయం చేయలేదన్నారు.

ఖమ్మం జిల్లాల్లో ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు మాట్లాడని.. కోదండరామ్‌.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై అభిమానం ఉందని చెప్పుకుంటున్న ఆయన కాంగ్రెస్‌ పార్టీతో ఎందుకు కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. లక్ష మంది కోదండరామ్‌లు అడ్డుపడ్డా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ వేసిన టెంట్‌ల కింద మైక్‌లు పెడితే మాట్లాడిపోయిన కోదండరాం ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.