స్టార్ హీరోల సినిమాల షూటింగ్ అంటే అక్కడ రెండు మూడు కారవాన్లు సిద్ధంగా ఉండాల్సిందే. స్టూడియోలో షూటింగ్ అంటే… పేరున్న నటులకు హాలీడేనే. కాలు తీసి కాలు వేస్తే గొడుగుపట్టేవాళ్ళు… ఎండపొడ తగలనివ్వకుండా ఏసీ క్యారవాన్లు… సకల రాజభోగాలూ… షరా మామూలే. కానీ, మరి విదేశాల్లో షూటింగ్ అంటే… స్వరాష్ట్రంలో షూటింగ్ అంత సౌకర్యాలుండవు. కానీ, సినిమానే శ్వాస, ధ్యాస అయినవాళ్ళకు సౌకర్యాల గురించి ఆలోచన ఎలా ఉంటుంది! అప్పట్లో స్వర్గీయ ఎన్టీయార్ లాంటి ఆ తరం తారలు దర్శక, నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తూ, ఎండైనా, ఏమైనా రోడ్డు మీద చెట్ల కిందే కూర్చొని, షూటింగులు చేసిన సంగతులు కథలు, కథలుగా విన్నాం. ఆయనకూ, ఆ తరానికీ అసలైన వారసుడిగా తాజాగా పోర్చుగల్‌లో షూటింగ్‌లో… అంతే ప్రశాంతంగా పచ్చిక బయలులో పడుకొని, హీరో అనే తేడా లేకుండా పని చేసిన బాలకృష్ణను చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయిందట
గమ్మత్తేమిటంటే, హైదరాబాద్‌లో షూటింగప్పుడు కూడా బాలకృష్ణ మేకప్ చేసుకోవడానికి తప్ప, క్యారవాన్ పెద్దగా వాడరు. చాలామందిలా షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో దానిలోకి దూరిపోవడమూ ఉండదు. బయట ఎండలోనే యూనిట్ అందరితో పాటు ఉంటూ, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ణీ, ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామినీ స్మరిస్తూ కూర్చుంటారు. కష్టపడే తత్త్వం, సీను బాగా రావడం కోసం దేనికైనా తెగించే మనస్తత్వం, పరిస్థితులను బట్టి సర్దుకుపోవడమే తప్ప, నిర్మాత నెత్తి మీద గొంతెమ్మ కోరికల బండబరువు పెట్టని బాలకృష్ణ మంచితనం తాజాగా మరోసారి ఋజువైంది.
బాలయ్య కొత్త సినిమా ‘పైసా వసూల్’ షూటింగ్ దాదాపు నెల రోజుల నుంచి పోర్చుగల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ షాట్ గ్యాప్ లో బాలయ్య రోడ్డు పక్కన పచ్చిక బయళ్లలో దిండేసుకుని పడుకుని కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షూటింగ్ కోసం రెడీ అయిన గెటప్ లోనే బాలయ్య పడుకుని ఉండటం విశేషం. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య సింప్లిసిటీ ఇదీ అంటూ ఈ ఫొటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి దటీజ్ బాలయ్య అంటూ నందమూరి అభిమానులు ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకలు పోర్చుగల్ లోనే ఘనంగా నిర్వహిస్తోంది చిత్ర బృందం ఇంకో పది రోజుల్లో అక్కడి షెడ్యూల్ ముగించుకుని ఇండియాకు రానుంది ‘పైసా వసూల్’ టీం.