ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట ముగిసింది. బాలాపూర్ గణేష్ లడ్డూ కొత్త రికార్డు సృష్టించింది. వేలంలో రూ.24.60 లక్షలు పలికింది బాలాపూర్ గణేష్ లడ్డూ. వేలంలో లడ్డూ దక్కించుకున్నారు వంగేటి లక్ష్మారెడ్డి. గతేడాది లడ్డూ రూ.18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, రమేష్ యాదవ్ దక్కించుకోగా ఈసారి భారీ స్ధాయిలో వేలంలో ధర పలికింది.
లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేశ్ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యాక్రమాల కోసం వినియోగిస్తూంటారు. హైదరాబాద్ నగరం అంటే గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరు. గణేష్ ఉత్సవాలను నగరవాసులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. నగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రత్యేకత ఉందో బాలాపూర్ గణేషుడి లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటానికి రాజకీయ నాయకుల నుండి పారిశ్రామికవేత్తలు ఇలా పలు రంగాలవారు పోటాపడుతుంటారు.
1980లో మొదలై…గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. తొలిసారి 1994లో నిర్వహించిన బాలాపూర్ లడ్డూ వేలంలో రూ. 450 పలికింది.