ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని జిల్లాలోని మెజారిటీ నేతల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. గీతం విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న శ్రీభరత్ కొన్నాళ్లుగా విశాఖ ఎంపీ స్థానంపై ఆసక్తి కనబరుస్తున్నారు.
శ్రీభరత్… బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని భర్త. శ్రీభరత్ తన తాతగారైన దివంగత ఎంవీవీఎస్ మూర్తి బాటలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని తమకు బాగా పట్టున్న వైజాగ్ పై దృష్టి పెట్టారు.
ఈ స్థానం నుంచి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసేందుకు విశాఖ జిల్లా తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శ్రీభరత్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు..
విశాఖ లోక్‌సభ స్థానానికి భరత్ ఆసక్తిగా ఉన్న అంశాన్ని సీఎంకు తెలిపామన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి ఎవరన్న విషయంపై సాయంత్రం నిర్ణయం వెలువడే అవకాశముందని చెప్పారు. వైకాపా అసంతృప్తులు వంశీ, కోలా గురువులు తనను కలిశారని.. వారి అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు.