‘పైసా వసూల్’ ప్రమోషన్‌లో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ ..అందులో భాగంగా రానా నిర్వహిస్తున్న ‘నెం.1 యారి’ షోలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సందడి చేశాడు బాలయ్య.
‘నెం.1యారీ .. విత్ రానా’ అనే టీవీ షోకి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. రానా ఈ షోను నడిపిస్తోన్న తీరు .. ఈ కార్యక్రమానికి రేటింగ్స్ ను పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రీసెంట్ గా బాలకృష్ణ .. పూరీ జగన్నాథ్ వచ్చారు. బాలకృష్ణ తాను స్టార్ హీరోననే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ వేదికపై సందడి చేశారు.
సెట్లో తనని సార్ .. అని పూరీ పిలిచేవాడనీ, అలా వద్దనీ .. బాలా అని పిలవమని వార్నింగ్ ఇచ్చానని బాలకృష్ణ చెప్పారు. తనకి కథ చెప్పే సమయంలో పూరీ ఎంతలా ఇబ్బంది పడింది బాలకృష్ణ యాక్ట్ చేసి మరీ చూపించారు. పూరీతో ఈ సినిమా చేయవద్దని తనకి చాలా మంది చెప్పారనీ, ఆ మాటలేవీ పట్టించుకోకుండా తాను ఈ సినిమా చేశానని అన్నారు.
ఇక పూరీ మాట్లాడుతూ.. బాలయ్య కోపిష్టి అని తనకి కూడా చాలామంది చెప్పారనీ, కానీ దగ్గరగా చూసిన తరువాత ఆయనేంటో తనకి తెలిసిందని చెప్పుకొచ్చారు.