జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్. పార్టీ ఇప్పుడు బాగానే ఉందన్నారు. అతని అవసరం టీడీపీకి ఏ మాత్రం లేదని చెప్పారు. ఇటివలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీఆర్ పై ఈరకంగా ఆరోపణలు చేశారు భరత్. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న వాదనతో తాను ఏకీభవించనని అన్నారు.
ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేత చంద్రబాబు తో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో, ఫ్యాన్స్ ఉన్న మాట వాస్తవమేనని రాజకీయాల్లోకి రావాలని తాను అనుకుంటే చంద్రబాబుతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న యువ నాయకత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళ్లగలిగితే పార్టీని తామే బలోపేతం చేసుకోగలమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట సామాన్యులే ఉన్నారని, వారందరూ జూనియర్ ఎన్టీఆర్లు కాదు కదా అంటూ భరత్ సమాధానం ఇచ్చారు. ఇటివలే గడిచిన ఎన్నికల్లో భరత్ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఇక భరత్ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.