ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన కుడిభుజానికి శనివారం ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స విజయవంతమవడంతో పాటు రెండు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న బాలయ్య.. సోమవారం ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు.
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌లో గాయాలకు గురైన ఆయన రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్నారు. అప్పట్లో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆయనకు ఇటీవల మేజర్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు తేల్చారు. అయినప్పటికీ ఆయన ‘జైసింహా’ చిత్రం షూటింగ్ సందర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు. దీంతో ఈ సర్జరీ చేసుకోలేకపోయారు. ఈ నొప్పి రోజురోజుకి తీవ్రమవడంతో సర్జరీ అనివార్యమైంది.
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)లు బాలయ్య కుడిచేయికి సర్జరీ చేశారు. రెండు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన నేడు డిశ్చార్జి అయ్యారు. ఆయనకి 5 నుంచి 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు. విశ్రాంతి అనంతరం నందమూరి నటసింహం మళ్లీ షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశముంది.