దివంగత ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ-తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడైన దగ్గరి నుంచి రోజుకో వార్త టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో గాసిప్స్‌కు పుల్ స్టాప్ పెడుతు చిత్ర వివరాలను వెల్లడించారు బాలయ్య.
ఈ నెల 29 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు బాలయ్య బాబు. ఈ సినిమాకు చాలా పేర్లు సూచించారని కానీ ఎన్టీఆర్ అన్న పదానికి మించి మరొకటి ఉండదన్న ఉద్దేశంతో ఆ పేరునే ఖరారు చేశామని తెలిపారు. హైదరాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియోలో ఆ తేది నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
బాలకృష్ణకు అచ్చొచ్చిన సంక్రాంతికి ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘డిక్టేటర్’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’ ఇలా వరుసగా మూడుసార్లు సంక్రాంతి మొనగాడిగా నిలిచిన బాలయ్య నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకురానున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా ఆయనే వ్యవహరించడం విశేషం. ఈ చిత్రంలో బాలయ్య 63 గెటప్పులలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన స్కెచ్చులు కూడా సిద్ధమయ్యాయి.