ఎంగేజింగ్‌గా “భజే వాయు వేగం”

11
- Advertisement -

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి

– రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత సాహోకు కంటిన్యూ అయ్యాను. కోవిడ్ కు ముందు ఈ సబ్జెక్ట్ ఓకే అయ్యింది. కార్తికేయ అప్పడు చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క చేస్తున్నాడు. కోవిడ్ వల్ల ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. “భజే వాయు వేగం” సినిమా షూటింగ్ మొదలుపెట్టి 70 పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తికేయ బెదురులంక షూటింగ్ కు వెళ్లాడు. అది ఫినిష్ చేసి వచ్చాక మా “భజే వాయు వేగం” కంప్లీట్ చేశాం.

– “భజే వాయు వేగం” కథ ప్రకారం ఫస్టాఫ్ కు ఒక పర్ ఫార్మర్ కావాలి. సెకండాఫ్ లో హీరోయిజం ఎలివేట్ కావాలి. అలా చూస్తే కార్తికేయ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. అతను పర్ ఫార్మెన్స్ చేస్తాడు, హీరో పర్సనాలిటీ ఉంటుంది. కార్తికేయను ఎంచుకోవడానికి కారణమిదే. అలాగే హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయబద్దమైన అమ్మాయి. ఐశ్వర్య మీనన్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం హాఫ శారీ, చీరకట్టులో ఫొటోస్ తో కనిపించింది. ఆమె ఈ మూవీలో ఇందు క్యారెక్టర్ కు కరెక్ట్ ఆప్షన్ గా భావించా.

– “భజే వాయు వేగం” సినిమా కొంత డిలే కావడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిట్ చేసిన వెర్షన్ ఫుటేజ్ పోయింది. మళ్లీ ఆ ఎడిటింగ్ కోసం మూడు నెలల టైమ్ అదనంగా పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ కోసం కొంత టైమ్ అదనంగా తీసుకున్నాం. ఫస్ట్ సినిమాకు ఇలా కొంత డిలే కావడం ప్రెజర్ గానే ఉండేది.

– ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ అనేది రివీల్ చేశాం. అయితే ఫాదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఓల్డ్ కాదు. ట్రైలర్ చివరలో మీ నాన్న కాదు మా నాన్న అని రాహుల్ కార్తికేయతో చెప్పడం కూడా కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానీ మీకు ట్రైలర్ చూపించింది రేపు థియేటర్ లో చూడబోయే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. కథను రివీల్ చేయకూడదనే ట్రైలర్ లో ఎలాంటి ట్విస్ట్ లు చూపించలేదు. హీరో క్రికెటర్ గా తన గోల్ అఛీవ్ చేశాడా లేదా అనేది ట్రైలర్ లో ఎక్కడా హింట్ ఇవ్వలేదు. ట్రైలర్ లో రాహుల్ చెప్పిన డైలాగ్ వాస్తవానికి సినిమా ప్రారంభంలోనే వస్తుంది. సినిమా మీద మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

– కథలో హీరోకు బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది చాలా కీ రోల్. హీరో తర్వాత హీరో లాంటి క్యారెక్టర్. ఈ పాత్ర కోసం ఎవర్ని తీసుకుందాం అని ఆలోచిస్తున్న టైమ్ లో యూవీ వాళ్లు రాహుల్ టైసన్ ను సజెస్ట్ చేశారు. అతను ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాడు. కార్తికేయకు బ్రదర్ అంటే ఫ్రెష్ గా ఉంటుందని నాకూ అనిపించింది. అలా రాహుల్ మూవీలోకి వచ్చాడు.

– ఊరి నుంచి పట్టణానికి మనమంతా ఏదో ఒకటి సాధించాలని వస్తాం. అలా వచ్చిన క్రమంలో ఇక్కడ కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. చివరకు మన గోల్ రీచ్ అయ్యామా లేదా అనేది చూసుకుంటాం. అనుకున్నది సాధించని వాళ్లూ ఉంటారు. హీరో అలా ఒక గోల్ మీద సిటీకి వస్తాడు. అతను తన గోల్ గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో వేరే సమస్యలు చుట్టుముడతాయి. తన లక్ష్యం వదిలేసి వీటిని సాల్వ్ చేసేందుకు వెళ్తుంటాడు. ప్రేక్షకులకు మాత్రం అతని గోల్ వేరు కదా అనిపిస్తుంటుంది.

– మాది మెదక్ జిల్లా. మా ఊరిలో రాజమౌళి గారి సై సినిమా షూటింగ్ జరిగింది. ఆ టైమ్ నుంచి నాకూ ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఏర్పడింది. రాజమౌళి గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరికీ నచ్చాక ఆయన పేరు చెబుతా.

– సినిమా సెకండాఫ్ లో ఛేజింగ్ లా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ లో మీరు ఫోన్ వైపు చూడరనే నమ్మకం ఉంది. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్పీడ్ లాంటి టైటిల్ మా మూవీకి పెట్టుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అని పెట్టాం. మా యూవీ వారికి కూడా బాగా నచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించాం. అఖిల్ తో యూవీలో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూసి టైటిల్ సజెస్ట్ చేశాడు.

Also Read:Naresh:బచ్చల మల్లి..ఫస్ట్ లుక్

– డైరెక్టర్ సుజీత్ కు ఎడిటింగ్ అంటే ఇష్టం. “భజే వాయు వేగం” సినిమా చూసి నచ్చి మా టీమ్ తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. సాధారణంగా సూజీత్ ఇంటర్వ్యూస్ చేయడు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ గారి ఓజీ గురించి సుజీత్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. వాళ్ల ఫ్యాన్స్ అంతా నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ అభిమానులు థియేటర్స్ కు వచ్చి మా “భజే వాయు వేగం” సినిమా చూడమని కోరుతున్నా.

– ఈ సినిమా బీజీఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నా. దాదాపు మూడు నెలలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే టైమ్ కేటాయించా. కపిల్ అని కొత్త అతను బీజీఎం ఇచ్చాడు. రాధన్ సాంగ్ చేశాడు. అతను చెన్నైలో ఉంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికి టైమ్ ఉండదని రాధన్ తో బీజీఎం చేయించలేదు. సెకండాఫ్ లో ఒక్క సాంగ్ ఉండదు. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంటుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ అక్కడ పాట ఉండాలని కోరుకోరు. పైగా దాన్నో స్పీడ్ బ్రేకర్ లా భావిస్తారు.

– ఆడియెన్స్ రీల్స్ చూసే ట్రెండ్ లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా చిన్న గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్ ను ఎంగేజ్ చేయాలనేది నా ఆలోచన. “భజే వాయు వేగం” సినిమాకు అదే ఫాలో అయ్యి రూపొందించాం. మనం అతన్ని హీరో అని పిలుస్తున్నాం కాబట్టి హీరో ఒక పెద్ద లక్ష్యంతో ఉండాలని నేను అనుకుంటా. ప్రేక్షకులకు హీరోకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా హీరో క్యారెక్టర్ ఉండాలి.

– అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న దానికంటే ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తే వెయ్యింతలు పని నేర్చుకోవచ్చు. సినిమాను అనేక దశల్లో బెటర్ మెంట్ చేసుకోవచ్చు. మిగతా ఏ క్రియేటివ్ జాబ్ లోనూ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.

– రాజమౌళి గారి సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ చాలా సాధారణంగా ఉంటాయి. కానీ అవి అసాధారణ సమస్యలను ఎదుర్కొంటాయి. నా సినిమాలోనూ హీరో అలా ఉండాలని భావిస్తా. ఆడియెన్ ఎన్నో సమస్యలు ఉండగా సినిమాకు వస్తాడు అతన్ని థియేటర్ లో ఇరిటేట్ చేయకుండా కాసేపు ఎంటర్ టైన్ చేయాలని నేను అనుకుంటా.

– ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. భజే వాయు వేగం సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త మూవీ అనౌన్స్ చేస్తానని చెప్పారు.

- Advertisement -