తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమా బడ్జెట్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమాను తెరకెక్కించడానికి ఎంత ఖర్చు చేశారనే విషయంపై అభిమానుల్లో కూడా ఎంతో ఆసక్తి ఉంది.
అయితే బాహుబలి పార్ట్ 1కి.. లాభాలు రాలేదంటే మాత్రం నమ్మకుండా ఉండలేరు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలను హైదరాబాద్, ముంబైలలో గురువారం నిర్వహించారు. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సినిమా బడ్జెట్, మొదటి భాగం రిలీజ్ తర్వాత తమకు ఎంత లాభాలు వచ్చాయనే విషయాలు వెల్లడించారు.
మొత్తంగా రెండు భాగాలకు కలిపి 450 కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్నారీయన. మొదటిపార్ట్ 150-200 కోట్ల వరకూ ఖర్చు కాగా.. రెండో పార్ట్ లో ఫైట్స్+గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో.. మరింతగా ఖర్చు పెరుగుతోంది. తొలి భాగానికి తాము లాభాలు అందుకోలేదని.. బాహుబలి ది కంక్లూజన్ తమకు ఆ లోటు తీర్చనుందని చెబుతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి పార్ట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా జరిగినట్లు స్పష్టమవుతోంది. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్ రన్ ద్వారా 1000 కోట్ల వసూళ్లు సాధించబోయే తొలి ఇండియన్ మూవీ ఇదే అనే అంచనాలు వినిపిస్తున్నాయి.