చంద్రబాబు అడ్డుపడకుండా ఉంటే 18 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేదన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్…ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు మహాకూటమి పేరుతో వస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని నాడు కాకినాడలో 1998లోనే బీజేపీ తీర్మానం చేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ చిన్న రాష్ర్టాలకు కట్టుబడి 2000లో ఛత్తీస్ ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ర్టాలను ఏర్పాటు చేసింది. తెలంగాణను ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీకి చంద్రబాబు అడ్డుపడ్డాడని ఆరోపించారు.
నాటి నుండి తెలంగాణపై అనేకసార్లు విషం గక్కారని చెప్పారు. తెలంగాణ రైతులు కరెంట్ అడిగితే కాల్చి చంపించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. తెలంగాణ పదాన్ని చంద్రబాబు అసెంబ్లీలో నిషేధించి అక్కసు వెల్లగక్కారని తెలిపారు. తెలంగాణ ఇవ్వొద్దని ప్రణబ్ కమిటీకి చంద్రబాబు లేఖలు రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాజెక్టులను, అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ-మహాకూటమికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు లేఖలు రాస్తే ఆ పనుల్లో కమీషన్లు తీసుకుంటున్నారని నాగం జనార్ధన్ రెడ్డి పిటిషన్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. వీటన్నింటిని కోర్టులు పట్టించుకోలేదని కొట్టిపారేసిందని తెలిపారు.