ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులను తిరిగి విచారించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన జస్టిస్ పీసీ ఘోష్, ఆర్.ఎఫ్.నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.బీజేపీ నేత కల్యాణ్ సింగ్ కు మాత్రం విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు.
గతంలో అద్వానీని విచారణ నుంచి అలహాబాద్ హైకోర్టు మినహాయించిన సంగతి తెలిసిందే. ఆపై విచారణ అధికారులు, ఘటన వెనుక అద్వానీ ప్రమేయం ఉందని, కరసేవకులకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ, కేసును కొనసాగించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, అద్వానీ సహా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపైనా విచారణకు పచ్చజెండా ఊపుతూ తీర్పిచ్చింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. కరసేవకులపైన ఒక కేసు, మసీదు కూల్చివేతకు ప్రేరేపించారని నాయకులపై మరో కేసు నమోదు చేశారు. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. కాగా సీబీఐ ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంలో బీజేపీ సీనియర్ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది.