ఇటీవల ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిరసనలు చేపట్టిన విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపిక పదుకునే సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. యూనివర్శిటీకి వెళ్లిన ఆమె విద్యర్థుల మధ్య కాసేపు గడిపింది. ఈ నేపథ్యంలో, పలువురి నుంచి ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. దీపికా చర్యని తప్పు పట్టగా, తాజాగా ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా దీపికాకి చురకలు అంటించారు. ఏదైన విషయం గురించి మాట్లాడే ముందు, దేశ సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. తెలియకపోతే ఎవరైన సలహాదారుడిని నియమించుకొని తెలుసుకునే ప్రయత్నం చేయాలని దీపికాకి సూచించారు.
రెండు కోట్లకి పైగా వలసదారులు దేశంలో అక్రమంగా నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు ద్వారా, అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుందని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. కొందరు సొంత ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇది దేశానికి మంచి కాదని స్పష్టం చేశారు. కాగా నటన విషయంలో దీపిక చాలా ప్రతిభావంతురాలని ఆయన కితాబిచ్చారు.