బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన నితీశ్‌ని డాడీ అంటూ ఘాటైన విమర్శలు చేశాడు. తనకు తెలిసినంత వరకు గాంధీ- గాడ్సే చేతులు పట్టుకుని ఉండరు కదా అంటూ చురకలు అంటించారు.
గత పదిహేనేళ్లుగా నితీశ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం చూశాం. కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే. పైగా ఆయన కొత్త స్నేహాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే బిహార్ ఇప్పుడు ఎక్కడ ఉందని నితీశ్ కుమార్, బీజేపీ దోస్తీపై విమర్శలు గుప్పించారు.
బిహార్ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని …అందుకే వేలాది మంది యువతతో రాజకీయ శక్తిని తయారుచేస్తామని పేర్కొన్నారు. బాత్ బిహార్ కీ అనే కార్యక్రమంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్)పై ప్రశాంత్‌కిషోర్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏఏ, ఎన్నార్సీకి మద్దతుగా నిలిచిన జేడీయూ… పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరించింది.