దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా బాహుబలి-2 సినిమా విడుదల కోసం చూస్తుంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం విడుదలను నిలిపేయాలంటూ కన్నడ సంఘాలు నిరసన గళం ఎత్తుకున్నాయి. కావేరి జలవివాదం సందర్భంగా కన్నడిగులను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేసిన సత్యారాజ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తు ఈనెల 28న బెంగళూరు బంద్ నిర్వహిస్తామని కన్నడ సంఘాల సమాఖ్య సంచాలకుడు వాటాళ్ నాగరాజు సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. క్షమాపణ చెప్పకపోతే సత్యరాజ్ నటించిన చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఏప్రిల్ 28న ఆ సినిమా విడుదల అవుతుందని ప్రకటించడంతో ఆందోళనకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. ఆరోజు బెంగళూరు పురభవన్ నుంచి వేలాది మంది స్వతంత్ర ఉద్యానవనం వరకు భారీ ప్రదర్శన చేపడతామన్నారు. బాహుబలి సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద ధర్నాలు ప్రారంభిస్తామన్నారు. దీంతో కట్టప్ప ఇప్పుడు బాహుబలి2 విడుదలకు ఆటంకంగా మారాడు.
అయితే సత్య రాజ్ క్షమాపణ చెబితే తమిళ ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు తమిళనాడులోనూ బాహుబలి కి చిక్కులు తప్పవు. కావేరీ జలాల సమస్యతో ఏ మాత్రం సంబంధం లేని ‘బాహుబలి-2’ ఇలా మధ్యలో ఇరుక్కుకోవడంతో రాజమౌళి ఏం చేయనున్నారనేది ఆసక్తిగా మారింది.