దర్శకధీరుడు రాజమౌళికి గొప్ప ఊరట లభించింది. కర్ణాటకలో బాహుబలి ది కన్ క్లూజన్ విడుదలకు అవరోధాలు తొలగిపోయాయి. కట్టప్ప క్షమాపణలు చెప్పని పక్షంలో ‘బాహుబలి-2: ది కన్ క్లూజన్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాల సమాఖ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి కన్నడలో తమ సినిమాకు సత్యరాజ్ (కట్టప్ప) కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సత్యరాజ్ శుక్రవారం క్షమాపణలు చెప్పడంతో కర్ణాటకలో సినిమా విడుదల చేయడానికి కన్నడ సంఘాలు అంగీకరించాయి. మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు జాగ్రత్తపడండి. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు భవిష్యత్తులో చేసే సినిమాలను విడుదల కాకుండా నిషేధిస్తాం’ సమాఖ్య సారథి వి.నాగరాజ్ హెచ్చరించారు.
ఇవాళ ఉదయం వరకు బెట్టు చేసిన కన్నడ సంఘాల సమాఖ్య…కట్టప్ప క్షమాపణలు చెప్పడంతో ‘బాహుబలి-2: ది కన్ క్లూజన్’ సినిమా విడుదలను అడ్డుకోమని ప్రకటించారు. తాము సత్యరాజ్ కు వ్యతిరేకం కానీ ‘బాహుబలి-2: ది కన్ క్లూజన్’ సినిమాకు కాదని వారు తెలిపారు. దీంతో ‘బాహుబలి-2: ది కన్ క్లూజన్’ చిత్ర యూనిట్ హాయిగా ఊపిరిపీల్చుకుంది. ఇదిఇలా ఉండగా బాహుబలి-ది కన్క్లూజన్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.