‘బాహుబలి ది కన్ క్లూజన్’ ఫీవర్ థియేటర్లను తాకింది. ప్రముఖ సినిమా టికెట్ల విక్రయ సంస్థ ‘బుక్ మై షో’ టికెట్ల ముందస్తు విక్రయాలను ప్రారంభించి.. తమ వెబ్ సైట్ లో 28 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. సినిమా చూడాలనుకుంటున్న రోజు, సమయం, ఏ థియేటర్, టికెట్ రేంజ్, ఎన్ని టికెట్లు కావాలి? వంటి వాటిని ఎంచుకుని డబ్బు చెల్లిస్తే, టికెట్లు ఇస్తామని చెప్పడంతో ఒక్కరోజులో వీకెండ్ మొత్తం టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బాహుబలి టికెట్లు కొనుక్కుందామని అనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురౌతుంది. ఇదే సమయంలో టికెట్లు గ్యారంటీ కాదని, లభ్యతను బట్టి ప్రయత్నిస్తామని, టికెట్ మొత్తంలో తేడా ఉంటే, ఆ డబ్బును వెనక్కు ఇస్తామని షరతులు పెట్టింది.
ఇక సింగిల్ థియేటర్లలోని టికెట్లు కూడా యాడ్ చేయగా అవి కూడా నిమిషాల్లోనే బుకింగ్ అయ్యాయని తెలిసింది. బాహుబలి2 సినిమా విడుదలకు వారం ముందే ఇంత హైప్ క్రియేట్ అయితే.. సినిమా విడుదల తరువాత కూడా టిక్కెట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదలవుతున్న బాహుబలి2 రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.