ఇప్పుడు సమ్మర్ హీట్‌ని సినీ లవర్స్ మర్చిపోతున్నారు. ఎందుకంటే ‘బాహుబలి-2’ ఆ హీట్ ని మర్చిపోయేలా చేస్తోంది. ఇప్పటికే బాహుబలి మానియా మొదలైంది. బాహుబలి2 మీద రోజు రోజుకూ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే బాహుబలి2 హవా ఇంకో నెలరోజుల్లో కనిపించబోతోంది. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే ఇదే క్రమంలో ఈ సినిమా ప్రమోషన్‌లో స్పీడ్ పెంచేస్తున్నాడు జక్కన్న.
ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తూ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోనే సెన్సేషనల్ ట్రైలర్‌గా పేరు తెచ్చుకుంది బాహుబలి2 ట్రైలర్ . ఇక అందుకు తగ్గట్టే అత్యంత భారీగా ఆడియో ఈవెంట్‌ని నిర్వహించేందుకు బాహుబలి టీమ్ రెడీ అవుతోంది.
ఇప్పటికే మార్చి 26న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీగా ఆడియో ఈవెంట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది నుంచి భారీగా అతిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ ఈ ఈవెంట్‌కి రానున్నారట. ఇక అతిధుల రేంజ్‌కు తగ్గట్టే వేదికను కూడా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఇదిలా ఉండగా ‘బాహుబలి- ది బిగినింగ్’ ఆడియో అప్పట్లో తిరుపతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి మాత్రం బాహుబలి టీమ్ హైదరాబాద్‌నే వేదికగా ఎంచుకోవడం విశేషం.