రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి 2’ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయ విహారం చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది. అసలు పోటీ అనేదే లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేసింది. విడుదలైన ప్రతి భాషలో రికార్డు కలెక్షన్లను రాబడుతు సరికొత్త చరిత్రను సృష్టించింది. విడుదలైన తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 194 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లవరకూ వసూలు చేసిన ఈ సినిమా, హిందీలో 500 కోట్లు వసూలు చేసింది.
అశేష ప్రజానీకాన్ని ఆశ్చర్యచకితులను చేస్తూ 1000 కోట్లు .. 1500 కోట్లను వసూలు చేసిన బాహుబలి 2, 50 రోజులు పూర్తయ్యేసరికి 1676 కోట్లను సాధించి రికార్డును సృష్టించింది.
ఈ 50 రోజుల్లో పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రదర్శించారు. కేన్స్ ఫిలింఫెస్టివల్, గోవా ఫిలిం ఫెస్టివల్స్ తోపాటు రొమేనియా మూవీ ఫెస్ట్ లో బాహుబలి-2ను ప్రదర్శించారు. త్వరలోనే జరగనున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రారంభ చిత్రంగా బాహుబలి-2ను ప్రదర్శించబోతున్నారు.
భారత్‌లో 1050 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు బాలీవుడ్‌లోనూ నంబర్ -1 వసూళ్ల సినిమాగా రికార్డులు తిరగరాసి ఇండియా సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.