హీరోయిన్ అయేషా టాకియా గుర్తుందా? ‘సూపర్’ మూవీతో తెలుగు ఆడియెన్స్‌ని ఫిదా చేసింది ఈ బ్యూటీ. అయితే హిందీలో పలు సినిమాల్లో నటించిన అయేషా హీరోయిన్ గా కెరీర్ కు ప్రాధాన్యతను ఇవ్వకుండా పెళ్లి చేసేసుకుంది. మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత అబుఅజ్మీ కుమారుడు ఫర్హన్ ను ఈమె పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు.
అయితే తాజాగా ఆయేషా భర్తకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయట. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆయనను చంపేస్తామని బెదిరించారట. అయేషా టకియా ఓ హిందువు అని, లవ్ జిహాద్‌లో భాగంగాన ఆమెను వివాహం చేసుకున్నాడని, త్వరలోనే ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని బెదిరించారట.
ఈ మేరకు ఆయేషా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల (జులై) 21న ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్ రాగా ఆయన 26న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా మీడియాకు తెలిసింది.
ఫర్హన్ అజ్మీ తండ్రి అబు అజ్మీ రాజకీయ నేత. ఆయన హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అలాగే ఫర్హన్ కూడా ఈ మధ్య ఒక వివాదాస్పద ట్వీట్ పెట్టాడు. అజాన్ గురించి సింగర్ సుచిత్ర పెట్టిన ట్వీట్ పై ఫర్హన్ స్పందించాడు. అజాన్ సౌండ్ తో తెల్లవారుఝామునే నిద్ర భంగం అవుతోందని సుచిత్ర ట్వీట్ పెట్టగా.. దానిపై ఫర్హన్ వ్యంగ్యంగా స్పందించాడు. సుచిత్రకు నిద్రమాత్రమే కావాలి.. మరేం వద్దు అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఫర్హన్ కు బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా..ఫర్హన్ అజ్మీ తండ్రి అబుఅజ్మీ ..తాజాగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో హిందూ సేనకు సంబంధించిన వాళ్లే ఈ పనిచేశారని పేర్కొన్నారు. ‘మీరంతా జంతువులు. లవ్ జిహాద్ పేరిట మీరు ఓ హిందువు మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? త్వరలోనే మీ కుటుంబాన్ని చంపేస్తాం. బాంబులు పెట్టి మరీ ఈ పనిచేస్తాం’ అంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.