పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారింది. గ్రామాల నుంచి నగరాల వరకు అంతా ప్లాస్టిక్ మయం. ఇబ్బడి ముబ్బడిగా వాడడం.. తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం. చెత్తకుండి, నాలాలు సైతం పాలిథీన్ కవర్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. జనరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారింది.
పాలు, కూరగాయలు, టీ, టిఫిన్, భోజనం.. ఏది తేవాలన్న ప్లాస్టిక్ కవర్లు కావాల్సిందే. ప్లాస్టిక్ లేనిదే ఏ సరుకు తెచ్చుకోలేని పరిస్థితి. ఇక భోజనం చేయాలన్న ప్లాస్టిక్ ప్లేట్‌లోనే చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి హ్యాండ్‌క్రాఫ్ట్స్ ప్లాస్టిక్‌పై సమరానికి సరికొత్త ఆలోచన చేసింది. ప్లాస్టిక్ కి బదులుగా అరిటాకులతో ఎంతో చక్కగా ప్యాక్ చేసిన భోజనాన్నిసరఫరా చేసి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ని వదిలేద్దాము..ఇతర మార్గాల లో కి పయనిద్దామని పిలుపునిస్తున్నారు.
వాస్తవానికి భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరిటాకు భోజనం చాలా ఫేమస్. అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి తదితర వంటకాలు వ డ్డించుకుని భుజిస్తే ఆ రుచి వర్ణనాతీతం. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కానీ కాలక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చాయి. తర్వాత మరింత చేరువగా ప్లాస్టిక్ అందుబాటులోకి రావడంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది.
ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎన్నో ఎన్జీవోలు,స్వచ్చంద సంస్థలు ముందుకువచ్చాయి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ని వదిలేసి భవిష్యత్ తరాలను కాపాడుకునేందుకు ప్లాస్టిక్‌ని వదిలేసేందుకు ప్రతి ఒక్కరు కలిసిరావాలని పిలుపునిస్తున్నారు.