తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ హామీలలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని గత ఏడాది డిసెంబర్ 9 న అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ అమల్లోకి వచ్చినది మొదలుకొని ఎన్నో సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టుముడుతూ వస్తున్నాయి. గతంలో ఆర్టీసీ ప్రయాణానికి మొగ్గు చూపని వారు సైతం ఇప్పుడు ఆర్టీసీ బస్సు వైపే పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఫలితంగా పురుషులకు బస్సుల్లో కూర్చునే స్థలం దొరకని పరిస్థితి. ఇక మహిళా ప్రయాణికులంతా బస్సులకే వెళ్తుండడంతో ఆటో, ఉబర్, ఓలా, డ్రైవర్లు తమ జీవనాధారానికి గండి పడిందని వెల వెలబోతున్నారు. .
ఇప్పటికే ఆటో డ్రైవర్లు వారి ఆవేదనను వెళ్ళబుచ్చుకునేందుకు రోడ్డెక్కి అందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని, తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి తమను ఆడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 4 న ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్లు. జీవనాధారం కరువైన తమకు నెలకు రూ.15 జీవన భృతి ఇవ్వాలని, లేదని ఆందోళనలు ఉధృతం చేస్తామని అటు డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. పరిస్థితుల దృష్ట్యా ఆటో డ్రైవర్లకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటోవాలా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి భారీ నష్టాన్ని తీసుకొస్తుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరి ఆటోవాలా విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read:IND vs SA:టీమిండియాలో మార్పులు తప్పవా?