తెలంగాణలో సూపర్ స్ప్రేడర్లను గుర్తించి వారందరికీ టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఈ వాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ప్రజాసేవకులుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ రాష్ర్ట ఆటో కార్మికుల పక్షాన రాష్ర్ట అధ్యక్షుడు వేముల మారయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వినతిపత్రం అందించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలను ఆటో డ్రైవర్లకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్‌కు ఆర్థిక సాయం కింద నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని కోరారు. కరోనాకు ఆటో డ్రైవర్లు బలయ్యారని, ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. కాగా, ఎల్.పి.జి. డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు మరియు పూల మార్కెట్లు, కిరాణా షాపులు , మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది.