చివరి టీ20లో భారత్‌ పరాజయం

177
India
- Advertisement -

ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆసీస్ ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో నెగ్గింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. కోహ్లీ 61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 85 పరుగులు చేశాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ 7 బంతుల్లో 2 సిక్సులతో 17 పరుగులు చేశాడు. శార్దూల్ భారీ సిక్సులు కొట్టడంతో కొద్దిగా ఆశలు కలిగినా, సాధించాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు గెలుపు సాధ్యం కాలేదు.

చిచ్చరపిడుగు హార్దిక్ పాండ్య కూడా ధాటిగా ఆడినా, దురదృష్టవశాత్తు జంపా బౌలింగ్ లో వెనుదిరిగాడు. పాండ్య 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 20 పరుగులు చేశాడు.ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ సున్నా పరుగులకే వెనుదిరగ్గా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 28 పరుగులు నమోదు చేశాడు. శాంసన్ (10), శ్రేయాస్ అయ్యర్ (0) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ 3, మ్యాక్స్ వెల్ 1, అబ్బాట్ 1, టై 1, జంపా 1 వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకొని ఆసీస్‌ను‌ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ రెండో ఓవర్‌ వేసిన వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు.ఫించ్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్‌ వేడ్‌ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్‌ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్‌ 79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వేడ్‌.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్‌ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. టీమిండియా బౌలర్లలో సుందర్‌ 2, నటరాజన్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు. ఇక డిసెంబరు 17న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు అడిలైడ్‌లో ప్రారంభం కానుంది.

- Advertisement -