ఇంగ్లండ్తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్లను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. యువ ఫాస్ట్ బౌలర్ మహ్లీ బియర్డ్మన్కు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కింది. మరోవైపు విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్కు టీ20 జట్టులో తిరిగి అవకాశం లభించింది.
ఇటీవల భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా-ఏ తరఫున మహ్లీ బియర్డ్మన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. దీంతో సెలక్టర్లు అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల ఈ పేసర్ చివరిసారిగా 2026 జనవరిలో ఆస్ట్రేలియా తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 2025 జూలై తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేయడంతో అతడికి ఈ అవకాశం దక్కింది.
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో జాక్ ఎడ్వర్డ్స్, స్పెన్సర్ జాన్సన్, లియామ్ స్కాట్లకు కూడా చోటు కల్పించారు. మిచెల్ మార్ష్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం రాబోయే టెస్టు సిరీస్లకు సిద్ధమయ్యేందుకు వారికి ఈ విరామం ఇచ్చారు.
టీ20 జట్టులో జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్తో పాటు మిచ్ ఓవెన్ కూడా తిరిగి చోటు సంపాదించాడు. నాథన్ ఎల్లిస్ వన్డేలకు అందుబాటులో లేకపోయినా టీ20 జట్టులో ఎంపికయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియా-ఏ తరఫున భారత్ పర్యటనలో, బిగ్ బాష్ లీగ్లో రాణించిన లచ్లాన్ షాకు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం లభించింది. సామ్ హార్పర్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, మహ్లీ బియర్డ్మన్, అలెక్స్ క్యారీ, కూపర్ కానోలీ, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆలీ పీక్, మాథ్యూ రెన్షా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా.
ఆస్ట్రేలియా టీ20 జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, మహ్లీ బియర్డ్మన్, నిఖిల్ చౌదరి, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, సామ్ హార్పర్, స్పెన్సర్ జాన్సన్, మిచ్ ఓవెన్, లచ్లాన్ షా, ఆడమ్ జంపా.
Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న
సిరీస్ షెడ్యూల్: నవంబర్ 13న తొలి వన్డే, నవంబర్ 15న రెండో వన్డే, నవంబర్ 18న మూడో వన్డే జరగనున్నాయి. టీ20 సిరీస్ నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 2న ముగియనుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు.

