ఫైనల్ లో ఆసీస్.. టీమిండియాకు కష్టమే?

49
- Advertisement -

గత నెల రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న వన్డే వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. న్యూజిలాండ్ పై విజయం సాధించి మొదటగా టీమిండియా ఫైనల్ చేరగా.. నిన్న సౌతాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో సఫారీలపై విజయం సాధించి ఆసీస్ ఫైనల్ కు చేరింది. దీంతో 19న జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియా జట్లు టైటిల్ బరిలో పోటీ పడబోతున్నాయి. నిన్న ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీస్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 212 పరుగుల తక్కువ స్కోర్ వద్ద ఆలౌట్ గా నిలిచింది. డేవిడ్ మిల్లర్ ( 101 ) సెంచరీతో చెలరేగడంతో ఆ మాత్రం స్కోర్ సఫారీలకు లభించింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ( 29 ), హెడ్ ( 62 ) అద్బుతమైన ఆరంభాన్ని అందించడంతో ఆ జట్టు లక్ష్య చేధన మరింత సులువైంది. అయితే ఆ వెంటనే ఓపెనర్లు ఔట్ కావడంతో మళ్ళీ సఫారీలకు ఆశలు చిగురించాయి. ఆ తరువాత కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ వచ్చినప్పటికి చేదించాల్సిన స్కోర్ తక్కువ కావడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయం సాధించి జట్టును ఫైనల్ కు చేర్చారు. మొత్తం మీద 47 ఓవర్లలో 7 వికెట్ల వికెట్లు కోల్పోయి 215 పరుగులతో ఆసీస్ జట్టు విజయతీరాలకు చేరింది. ఈ విజయంతో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికంగా ఎనిమిది సార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇక 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడిన టీమిండియా ఆస్ట్రేలియా జట్లు 20 ఏళ్ల తరువాత మళ్ళీ తలపడుతున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి. వరల్డ్ కప్ లీగ్ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించినప్పటికీ.. ఫైనల్ లో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేస్తే టీమిండియా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:TTD EO:నాపై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు స‌రికాదు

- Advertisement -