జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేపట్టిన ప్రచారం రెండో రోజు కొనసాగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని జహీరానగర్‌లో చేపట్టిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న గద్వాల్ విజయలక్ష్మీ, వెంకటేశ్వర్‌నగర్ నుంచి మన్నె కవితారెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న సూర్యనారాయణలను గతంలో మాదిరి తిరిగి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చుకుందామనేది టీఆర్‌ఎస్ నినాదమని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే బీజేపీ నినాదం హైదరాబాద్‌ను విద్వేష నగరంగా చేయాలని అన్నారు. హిందూ-ముస్లింలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ కలిసి ఉండనీయొద్దనేది వాళ్ల విధానమన్నారు.
ఇగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఆంధ్రా, తెలంగాణ పంచాయతీ అయితదా? హైదరాబాద్‌లో కరెంట్ ఉంటదా? ఉద్యోగాలు వస్తాయా? పెట్టుబడులు కొత్తవి కాదుకదా.. ఉన్నవి కూడా పోతయట అని ఇలా నానా రకాలుగా ఆనాడు ప్రచారం చేశారు. మంచినీళ్లకు ఎంత గోస ఉండె. వారం, పద్నాలుగు రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి చూశాం. ఆనాడు కరెంటు ఉంటే వార్తా. ఆరేండ్ల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కరెంట్ పరిష్కారం అయింది. మంచినీళ్ల సమస్య పరిష్కారం అయింది. ఇంకో 30 ఏళ్ల వరకు ఇంకా జనాభా పెరిగినా నగరంలో నీటికి సమస్య రాకుండా చుస్తున్నం. రూ. 5కే భోజనం.. పేదవాడి కోసం బస్తీ దావఖానాలు పెట్టాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినం అని కేటీఆర్ తెలిపారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతుంటే దానికి కొంతమందికి కడుపుమండుతుంది. పేదింటి ఆడబిడ్డ చేసుకుంటుంటే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా రూ.లక్ష 116 ఇస్తున్నం. ఎక్కడన్న వేరే రాష్ట్రంల్లో వస్తున్నయా? బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇస్తున్నారా. కేసీఆర్ కిట్టు, చదువుకుంటామంటే రెసిడెన్షియల్ స్కూళ్లు, రైతుబంధు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌లో ప్రజలకు కరోనా కష్టం వస్తే అండగా ఉన్నాం. వరదలు వస్తే ఆదుకున్నాం. ఇంటింటికి తక్షణ సాయంగా రూ. 10 వేలు అందజేసినం. దానికి కూడా బీజేపీ మోకాలడ్డింది. మాటలు, డైలాగులు చెప్పుడే తప్ప కేంద్రం నుంచి ఒక్క పైసా ఇవ్వరు, తీసుకురారు. విషయం లేదు కాబట్టే విషం చిమ్ముతున్నరన్నారు. డిసెంబరు 4 తర్వాత అర్హులైన వారికి రూ. 10 వేలు ఇప్పించే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.