సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందిస్తున్న 2.0 సినిమా ఆడియో వేడుకను సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న దుబాయ్ లో జరగనున్న ఈ వేడుక వివిధ ప్రత్యేకతలు సంతరించుకుంటోంది. ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్ లో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ రెహ్మాన్, శంకర్ లు తాము బస చేసిన హోటల్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి బుర్జ్ దుబాయ్ హోటల్‌కి చేరుకుంటారు. ఆ రోజు అంతర్జాతీయ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు జరుగుతున్న కార్యక్రమాల హైలైట్స్ ను టీజర్ రూపంలో విడుదల చేయడంతో ఈ ఆడియో వేడుకపై మరింత ఆసక్తి పెరుగుతోంది.
ఈవేడుకలో విశేషాలు..బుర్జ్ దుబాయ్ పార్కు హోటల్‌లో ఒక సినిమా ఆడియో వేడుక జరిపేందుకు దుబాయ్ ప్రభుత్వం అనుమతివ్వడం ఇదే తొలిసారి.125 సింఫొనీ కళాకారులతో కలిసి ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి. అంతేకాదు ‘2.0’లో ఒక పాటకి రెహ్మాన్ లైవ్ కంపోజింగ్ చేయనున్నాడు. రజనీకాంత్ – శంకర్ – రెహ్మాన్ కాంబినేషన్‌లో వచ్చిన పాటలకు బాస్కో డ్యాన్స్ బృందం ఆటపాటా. 12వేల మంది ఈ వేడుకను ఉచితంగా చూసేందుకు ఏర్పాటు చేశారు. దుబాయ్‌లోని పెద్ద పెద్ద మాల్స్‌లో రూ.2కోట్ల వ్యయంతో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దుబాయ్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందాట. అలాగే ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కమల్‌హాసన్‌ని దర్శకుడు శంకర్ కలసి అభ్యర్థించినట్లు సమాచారం. అయితే రాజకీయాలతో బిజీగా ఉన్న కమల్ ఆడియో ఫంక్షన్‌కు హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.