సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా, భద్రతాపరంగా చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలోని ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు క్షుద్ర పూజల యత్నం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఉదయం గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి ఆమె ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరేసి అక్కడి నుంచి వేగంగా పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే స్పందించి, దుండగులు వచ్చిన కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆ వ్యక్తులు తప్పించుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఇంటి ముందు నిమ్మకాయలు, నువ్వులు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి స్పందిస్తూ, ఇది తెలిసిన వారే చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం బెదిరింపే కాకుండా తన కుటుంబ భద్రతపై ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
Also Read:Funky:‘ఫంకీ’ ట్రైలర్ అప్‌డేట్
ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే శ్రావణి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

