కరాటే కళ్యాణిపై జరిగిన దాడి ఘటనలో ఆదిభట్ల పోలీసులు 10 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి BNS 74, 75, 79, 115(2), 132, 351(2), 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై దాడి, అసభ్య ప్రవర్తన, బెదిరింపులు, అడ్డగింపు వంటి తీవ్రమైన ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం, సిద్ధమౌని నరేందర్ అనే వ్యక్తి లక్కీ డ్రా పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కరాటే కళ్యాణి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదిభట్ల వండర్లా సమీపంలో ఫార్చునర్ కారు బహుమతిగా ఇస్తామని ప్రచారం చేస్తూ లక్కీ డ్రా నిర్వహిస్తున్న నరేందర్‌ను ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకొని కళ్యాణితో కలిసి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో, పోలీసుల ముందే 10 మంది నిందితులు కరాటే కళ్యాణిపై దాడికి పాల్పడ్డారు. ఆమె చున్నీ లాగడంతో పాటు ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేయడానికి ప్రయత్నించారని కళ్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, “రేప్ చేస్తాం” అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు.
Also Read:‘స్వయంభూ’..విడుదల తేదీ వాయిదా!
ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ప్రధాన నిందితుడు నరేందర్‌పై గతంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులు కూడా నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు.

