నేడు ఆకాశంలో అద్భుతం..

325
- Advertisement -

నేడు ఆకాశంలో అరుదైన అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. పండు వెన్నెలను పంచే చంద్రుడు ఇవాళ రాత్రి అరుదైన రూపంలో మనకు దర్శనమివ్వనున్నాడు. సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌, బ్లడ్‌ మూన్‌ లను చంద్రుడు ఒకేసారి తన వెంటపెట్టుకు రానున్నాడు. ఈ అరుదైన పరిణామాన్ని ‘సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌’గా పిలుస్తున్నారు. గగనతలంలో ఇటువంటి అత్యంత అరుదైన దృశ్యం గతంలో 1982లో చోటుచేసుకుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఇన్నాళ్లకు వీక్షించే అవకాశమొచ్చింది. ఇలాంటి అవకాశం మళ్లీ 2037 వరకూ రాదు. భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని ‘సూపర్‌ మూన్‌’ గా పిలుస్తారు.

Astronauts Just Might See the Super Blue Blood Moon from Space!

ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు. మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘‘బ్లూ మూన్‌’’గా పిలుస్తారు. చంద్రగ్రహణంనాడు ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి. దీంతో చంద్రుడు గోధుమ వర్ణంలో కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని బ్లడ్‌ మూన్‌గా చెబుతారు. బ్లూ, బ్లడ్‌, సూపర్‌ మూన్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు. ఈ పరిణామాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా వాసులకు దక్కనుంది. మరోవైపు భారత్‌లోనూ సాయంత్రం 5.18 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుందని హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బీజీ సిద్ధార్థ్‌ తెలిపారు. సూర్యాస్తమయం (6.25 గంటల) దాటిన తర్వాత ఆకాశంలో తూర్పువైపు ఈ పరిణామాన్ని చక్కగా చూడొచ్చని పేర్కొన్నారు. 7.25 వరకూ ఇది కొనసాగుతుందని చెప్పారు.

Astronauts Just Might See the Super Blue Blood Moon from Space!

ఇవాళ చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివుంచనున్నారు. ఈ రొజు సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. గ్రహణం కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేశారు. ఈరొజు ఆర్జిత సేవలు, సహస్రకలశాభిషేకం, కల్యాణోత్సవం ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవలు, పౌర్ణమి గరుడసేవలను కూడా టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఇవాళ శ్రీవారి ఆలయం ఉదయం, రాత్రి కలిపి దాదాపు 5 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుందని, భక్తులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తమ తిరుమల యాత్రను సాగించాలని టీటీడీ సూచనలు చేసింది.

- Advertisement -