ISS:వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం

7
- Advertisement -

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అప్రమత్తతను కలిగించే పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం తలెత్తడంతో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నలుగురు వ్యోమగాములతో కూడిన బృందం తమ మిషన్‌ను ఒక నెల ముందుగానే ముగించుకుని భూమిపైకి తిరిగి రానున్నట్లు నాసా అధికారికంగా ప్రకటించింది.

నాసా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం పూర్తిగా వైద్యపరమైన జాగ్రత్త చర్యగా తీసుకున్నది. ఇది అత్యవసర తరలింపు కాదని, పరిస్థితిని ముందుగానే అంచనా వేసి వ్యోమగామి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ వ్యవధిని తగ్గించామని ఒక నాసా అధికారి తెలిపారు. అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరును, గోప్యత కారణాల వల్ల, నాసా వెల్లడించలేదు.

సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగే మిషన్లు నిర్ణీత కాలపరిమితి మేరకు కొనసాగుతాయి. అయితే వైద్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో మిషన్‌ను తగ్గించుకోవడం చాలా అరుదైన విషయం. ఈ తరహా నిర్ణయం నాసా చరిత్రలో ఇదే తొలిసారిగా నమోదవడం విశేషం. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వ్యోమగాముల ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశం కావడంతో, చిన్న సమస్య కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఇతర వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నాసా స్పష్టం చేసింది. భూమిపైకి తిరిగి వచ్చిన అనంతరం అనారోగ్యానికి గురైన వ్యోమగామికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు, అవసరమైన చికిత్స అందిస్తామని నాసా అధికారులు తెలిపారు. ఈ ఘటన అంతరిక్ష మిషన్లలో భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తోందని అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

- Advertisement -