2027 వన్డే ప్రపంచ కప్..అశ్విన్ జట్టు ఇదే!

0
- Advertisement -

దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా వేదికలుగా జరగనున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో ఆటగాళ్ల ఎంపికను అంచనా వేశారు. ఈ క్రమంలో భారత జట్టుకు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని ఆయన గట్టిగా సమర్థించారు.

భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో టీ20ల్లో, అదే ఏడాది వన్డేల్లో భారత్ తరఫున ఆడారు. ఆ తర్వాత వయస్సు (ప్రస్తుతం 36 ఏళ్లు), గాయాల సమస్యల కారణంగా జట్టు యాజమాన్యం ఆయనను పక్కన పెట్టింది. ఒకవేళ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడితే భారత్ తరఫున ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ 37 ఏళ్ల వయస్సుతో అత్యంత సీనియర్ పేసర్‌గా నిలుస్తారు.

ఈ సందర్భంగా యూట్యూబ్ వీడియోలో అశ్విన్ మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ ఎంపికకు నా వైపు నుండి ఓకే (Yes). నేను అతడితో నేరుగా మాట్లాడతాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీ వంటి అన్ని దేశవాళీ టోర్నమెంట్లు ఆడేలా చేసి, దక్షిణాఫ్రికా పర్యటన నాటికి అతడిని సంపూర్ణ సన్నాహకంతో సిద్ధం చేయాలి. అక్కడ ఆడేందుకు మనకు అతడి అనుభవం తప్పకుండా అవసరం అన్నారు.

దక్షిణాఫ్రికాలో ఆడిన 13 అంతర్జాతీయ మ్యాచుల్లో భువనేశ్వర్ 19 వికెట్లు తీశారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన 5/24గా ఉంది. ఇక ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన రోయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరఫున భువనేశ్వర్ అద్భుత ఫామ్‌ కనబరిచారు. హై-స్కోరింగ్ మ్యాచుల్లో కూడా టెస్ట్ మ్యాచ్ తరహా స్వింగ్, యార్కర్లతో మెరిసి, 16 మ్యాచుల్లో 17.89 సగటుతో 28 వికెట్లు పడగొట్టి టోర్నీలో రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచారు.

తన అంతర్జాతీయ కెరీర్‌లో 121 వన్డేలు ఆడిన భువి, 35.11 సగటుతో 141 వికెట్లు పడగొట్టారు. మొత్తం 229 అంతర్జాతీయ మ్యాచుల్లో 294 వికెట్లు సాధించారు.

అశ్విన్ 2027 ప్రపంచ కప్ జాబితా:

ఖచ్చితంగా ఉండాల్సిన వారు (‘YES’):

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్. వీరితో పాటు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, దక్షిణాఫ్రికా పిచ్‌లకు అనుకూలించే ఎత్తు, పేస్ కలిగిన హర్షిత్ రాణాలకు కూడా అశ్విన్ ఓకే చెప్పారు.

Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?

పరిశీలనలో ఉంచాల్సిన వారు (‘MAYBE’):

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

అవసరం లేదన్నవారు (‘NO’):

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్.

- Advertisement -