ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లి సేన ఘన సాధించింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కిచుకుంది. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు 186/6 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 13 పరుగులు మాత్రమే జోడించి 195 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్ అశ్విన్ అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. అశ్విన్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ తొలుత ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో (51)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ వరుస ఓవర్లలో వోక్స్, రషీద్, ఆండర్సన్‌లను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.
ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. భారత్ లక్ష్యసాధనకు దిగకుండానే ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజు ఆటలో కేవలం 8.0ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లండ్ మిగతా నాలుగు వికెట్లను నష్టపోయింది. దాదాపు మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోపే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 400, భారత్ 631 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు సాధించి మరోసారి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.